Monday, November 30, 2015

కార్తికపురాణము--19




ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తిక పురాణము--19

జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను, దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రందున్న శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచరప్రాణులచే స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవిభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్నరూపుడవు నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈజగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ కృష్ణా! నీకు నమస్కారము. ఓయీశ్వరా! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శనఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ నమస్కారము. ఓదేవేశా! నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా, పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు. గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు నమస్కారము.

ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు నమస్కారము. వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు. అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి నీరూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా! నీస్తోత్రమునకు సంతోషించితిని. నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను. కోరుకొనుము. అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను. గోవిందా నాయందు దయయున్నయెడల నీస్థానమును యిమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను. ఓజ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును. కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు. బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును జెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము.

నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచాతుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్యఫలమును బొందును. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా యీనిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననసరించి నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు. నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠింు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోను ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు గాని, ఎవరైనను హరిపరాయణులై ఈనాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను. ఈచాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుంిన యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసికొని చాతుర్మాస్యమునందు హరిని బూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందెడి గతిని బొందును. సందేహము లేదు. పరమాత్మతుష్టిై చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వానిఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసికొని ఏవిధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణులోకమును జేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయిరి.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః

శివపురాణము--19


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--19 

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము
ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!
ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.
రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు. అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. 
ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. 
ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు. 
పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.

Sunday, November 29, 2015

కార్తికపురాణము--18



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___ 
పూజ్య గురువులు చెప్పిన కార్తిక పురాణము--18

ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా! నేననుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓమునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరయిరి. పాపవంతుడైన నేనెక్కడ. ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధముచేత నాపాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదవినుము. అనిత్యమైన ఈదేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు. అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయవలెను. దానితో చిత్తశుద్ధిగలిగి తద్ద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను. దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి యందుకార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది ;పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తికమాసము ఈకార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈకార్తికముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తికమాసముతో సమానమయిన మాసము లేదు. కర్మ స్వరూపమును దెలిసికొని కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును.
ఉద్భూతపురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆవ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈమనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పెదను. సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తికశుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక యిది పుణ్యకాలము.ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈనాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈవిషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చివచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములఓ ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను.
ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్ములందున్నారా? ఈవిషయమంతయు ఈసభలో జెప్పుము. నారదుడు ఆమాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె. ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు దెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా నున్నారు. కాబట్టి ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులై యుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి. కొందరు ఏకాదశ్యు[అవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి. కొందరాత్మచింతజేయుచుండిరి.
బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతింతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారిముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః

శివపురాణము--18


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివ పురాణము--18

నాగేశ్వర జ్యోతిర్లింగము 
యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై 
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. 
దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. 
అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.
వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు. 
ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. 
పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.

Saturday, November 28, 2015

కార్తికపురాణము--17




ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణం --17 

అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల, సూక్షమములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీవిషయము పూర్వమందు కైలాసపర్తమున పార్వతికి శంకరుడుజెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెడను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి(నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈవాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను.ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్నము నీవెందుకు తెలుసుకొనుట లేదు. సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈదేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది. గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని=ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను=ఆబ్రహ్మనని తెలిసికొనుము.
ఎవనియొక్క సాన్నిధ్యమాత్రముచేత జడముైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును ౧. పుట్టుటా=జనిమత్వ, ౨. ఉండుట=అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ=పెరుగుట, ౪. పరిణామత్వ=పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ యారు వికారములు లేనివాడు. వికారములు ఈఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థముు ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్ఛబ్దార్థమునుజ్ దెలిసికొనవలయును.
శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేనచ!
వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!
తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగాదనియు, తమస్సుకు పైదనియు అనుపమానందరూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్ధము. వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.
వేదములందు ఎవ్వనికి "తదనుప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆజీవులను గురించి నియంతృత్వమున్ను జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ. పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనా తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈలక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చటభాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్త్వమసియందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించినయెడల అభేదము సంభవించును. తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును యిట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసింును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః

శివపురాణము--17


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--17  

రామేశ్వర లింగము 
రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు. 
స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా 
పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!
ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు. 
ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ 
‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి. 
రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస్టేషనులోనే దక్షినామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. 
అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. 
ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు

Friday, November 27, 2015

కార్తికపురాణము--16




ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణం  
వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తికమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి. ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః

శివపురాణము--16


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--16

వైద్యనాథ లింగము 
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!
‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు. 
ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. 
రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది. 
దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.
అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. 
ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.

Thursday, November 26, 2015

కార్తికపురాణము--15



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీక పురాణము-15

ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరనివాసి యగును. ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును. కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన పుణ్యమునకు అంతములేదు. ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను, ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును. కార్తీకమాసము నెల రోజులు దీపమును బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును. కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆద్రవ్మును భూమియందు దాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః

శివపురాణము--15


ఓం శ్రీ గురుభ్యోనమః  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారు
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--15 

విశ్వేశ్వర లింగము – వారణాసి – భాగం – 2
మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణమునకంతటికీ కాపలాదారై ఉంటాడు. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వమును ఇస్తుంది. 
కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. 
తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. 
కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.
కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి.
తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.
అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్టు పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు. 
కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. వీలయితే మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి. 
వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. ఆ విశాలాక్షి దర్శనం చెయ్యకపోతే కృతఘ్నులం అయిపోతాము. 
అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేశారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది. 
కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి వాని దగ్గరికి వచ్చి కూర్చుని తన పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ ప్రాణి ఎంతగానో సేదతీరుతాడు. భ్రుంగి వచ్చి లలాటమునందు పెడతాడు. మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడు. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. మన పాపధ్వంసము చేయకలిగిన కాశీ కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమపావనమయిన భూమి. 
సానందమానందవనే వసంత మానందకందం హృతపాపబృందం 
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.

Wednesday, November 25, 2015

శివపురాణము--14


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--14    

విశ్వేశ్వర లింగము – వారణాసి – భాగం – 1
వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.
సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం 
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!
ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు. 
ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది. 
అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. 
అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. 
భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.
వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.

కార్తికపురాణము--14



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారు
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణం  
కార్తిక పురాణము--14

కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.
ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. కపాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు
శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!
అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!
అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః

Tuesday, November 24, 2015

శివపురాణము--13


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--13 

త్ర్యంబకేశ్వరుడు 
‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము. 
సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే, 
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)
త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము. 
గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు. 
ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. 
ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. 
వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.
అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు. 
గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.
తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది. 
గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.

కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.

కార్తీకపురాణము--13

Brahmasri Chaganti Koteswara Rao Garu ____/\____

మా గురువు గారు చెప్పిన కార్తీకపౌర్ణమి స్తోత్రం

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!
Keetah patangaah masakaascha vrikshaah
Jale stthale ye nivasanti jeevaah;
Drshtvaa pradeepam nacha janmabhaaginah
Bhavanti nityam svapachaahi vipraah.


వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?

chaalaa dhanyavaadaalu guruvu gaaru...mee dayavalla ilaantivi teliyanivi telusukontunnaamu
Om gurave namahaa___/\___



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన 
కార్తీక పురాణము--13

వశిష్టుడిట్లు చెప్పెను. జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో విుు. ఆధర్మములన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తీక ధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకు జెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయనియెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు. కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రీజప ఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును జెప్పుటకు నాకు శక్యముగాు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్మును ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు. కార్తీకమాసమందు ఉపనయనదానమును జేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును జేయించవలయును. సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను. అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును జెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని యెవ్వనికి సామర్ధ్యము గలదు? పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసినయెడల ఆపుణ్యము ద్రవ్యదాతకు గలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును జేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలో ప్రాప్తి కలిగించినవాడగును. ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ యొకటి గలదు. చెప్పెదను. సావధానుడవై వినుము.
ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై "అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ" అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆయరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతియాయెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆపర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆకన్యక వృద్ధినొంది సౌందర్యముతోనుజ్ లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను. ఆచిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను జూసియొక ముని కుమారుడు సువీరా! నీకూతును నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆమాటవిని రాజు మునికుమారకా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను. ఓ జనకమహారాజా! ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను బొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదననెను. తరువాత మునికుమారుడు ఆనర్మదాతీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను. ఆకన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరును. రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి యీసారి యీ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును. దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతును జూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆయతీశ్వరుడు దయతో ఓయీ నీవెవ్వడవు ఈఅరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాు చెప్పుమనియడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈవనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈయరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆచిన్నదానిని యౌవనమురాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకయేమివినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి యిట్లనియెను. రాజా! ఎంతపనిచేసితివి. మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి. కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి జేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా జెప్పబడియుండలేదు. కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈరెండవ కూతునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్ దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను జేిన వాడు పొందెడి ఫలమును బొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనియె. బ్రాహ్మణుడా ఇదియేమి మాట. పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా యేమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? నాయీ రెండవ కూతును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆద్రవ్యముతో సుఖభోగములను బొందెదను. నీకెందుకు నీదారిని నీవుపొమ్ము. ఆమాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి. అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును రాజు పితరులను గూడ పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము. ఈసువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను. స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను. ఈశ్రుతకీర్తి సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు యొకనాడు యిదియేమియన్యాయము, పుణ్యముజేసిన నన్ను యమలోకమందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితోనిట్లనియె. సర్వమును దెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము. ఎంతమాత్రమును పాపమును జేయని నాకు ఈనరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది? శ్రుతకీర్తి యిట్లు చెప్పిన మాటలను విని యముడు పల్కెను. శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గాని నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈదేహముతో అచ్చటికిబోయి అచ్చటనున్న మునులతో యీమాటను జెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడ ధనదాతయును, లోకాధిపతియునగును. కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును బొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము. దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు. శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందుఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుబోయి సుఖముగానుండెను. తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను. దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకుబోయిరి. తానును యథాగతముగా స్వర్గమును జేరెను. కాబట్టి కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును. ఇందుకు సందేహములేదు. కన్యామూల్యము యివ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము జేసిరేని వారి పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుజ్యమును బొందును. ఇది నిజము. నామాట నమ్ముము. ఈప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః